24, మార్చి 2011, గురువారం


ప్రజాస్వామ్యం  ప్రజల మతం...!
ప్రజాస్వామిక సూత్రాలను సిద్దాంతీకరించినది,  మానవతావాదులే అన్నది నిర్వివాదాంశము.  సర్వమానవ సౌభ్రాతృత్వం,  స్వేచ్చ,  సమత అనే భావనలు, ప్రజాస్వామ్యానికి మూలాలు.  సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి వ్యక్తికి,  పరిపాలనలో కూడా భాగస్వామ్యం ఉండాలి అనే సూత్రం ఆధారంగా, ప్రజాస్వామిక సిద్దాంతము ఏర్పరచబడినది.  మానవతావాదులు, నాటి  రాజ్య  పాలనలోని,  అమానుషత్వం,  నిరంకుశత్వాన్ని, మతం పేరుతొ సాగిన దమననీతిని, పక్షపాత వైఖరిని నిరశించి,  పీడితప్రజల   దుర్భరమైన  సామాజిక స్థితిగతులను జీర్ణించుకోలేక,  తీవ్రమైన వేదనకు  పరితాపానికి గురియై, తమ యావజ్జీవితం అంకితభావంతో శ్రమించి, సూత్రీకరించిన ఈ సూత్రాలు, దైవనిర్ణయాలుగా భావించాలి.  మతవాదుల సంకుచిత ధోరణి వలన ప్రజలలో, మతంపై విశ్వాసం సన్నగిల్లి,  ప్రత్యామ్నాయ విధానాలు వెదకుచున్న తరుణంలో,  ఈ ప్రజాస్వామ్యం రూపుదాల్చి, చక్కని సిద్దాంతంగా సర్వవ్యాపితంగా ఆమోదం పొందినది.   
ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు ఆకర్షితులై, ఉద్యమించి, పోరాడి, త్యాగాలతో, రక్తపాతంతో సాధించికొన్నారు.  వారి త్యాగాలు వృధా కాకుండా,  ప్రజస్వామ్యాన్ని పటిష్టంగా రూపొందించుటకు, సంకుచిత, స్వార్దశక్తులను ఏరిపారవేయుటకు, ప్రజలు తమవంతు పాత్ర పోషించాలి.  
ప్రజాస్వామ్యం  ప్రజల మతం కావాలి.  
           ప్రభుత్వ కార్యాలయాలు ప్రజాస్వామ్యానికి   దేవాలయాలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను   ఈ ఆలయాలలో  పూజాదికాలు నిర్వహించుటకు నియమించబడిన అర్చకులుగా  పరిగణించాలి! (priests and servants of the Temple of Democracy).  ఈ దేవాలయాలకు తమ కార్యార్ధం వచ్చే ప్రజలు, ప్రజాస్వామిక  వ్యవస్థపై   ఎంతో నమ్మకంతో, భక్తితో వస్తారు. వారికి స్వార్దరహితంగా, నిష్పక్షపాతంగా  సేవచేయడం, ఆ ప్రజాస్వామికఫలాలను   సమానంగా పంచటం ఈ ఉద్యోగుల భాద్యత.  ఆవిధంగా పవిత్ర ప్రజాస్వామిక సూత్రాలను ఆచరించి,   అర్చించడంగా భావించాలి!  
                అమ్మ అవనీమాత  సంతానమైన మనం, ఆమె ఆకాంక్షలను  సఫలంచేసి,      అన్నదమ్ముల్లా మెలిగి, ఈ ప్రకృతిమాత పంచిన జ్ఞాన సంపదలను మన సహోదరులకు సమానంగా పంచుకొని,  ఆనందాల  వేల్లువలయ్యే క్షీరదారాలలో జీవతం సార్ధకం చేసికోవాలి.  ఆవిధంగా   ఆమెకు మనం మన భక్తీ చాటుకోవాలి.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి