26, ఫిబ్రవరి 2011, శనివారం

శక్తి, దాని మూలాలు, దాని రూపము, దాని స్థితిగతులను శోధించటం అసాధ్యం!


          ఏ శక్తి ఈ సృష్టిస్థితిలయలకు కారణమో,  ఏ లయబద్దతతో ఈ అనంతకోటి సూర్య నక్షత్ర కూటములూ, గ్రహరాశులూ, వాని వాని కక్ష్యలలో  పరిభ్రమిస్తున్నాయో, ఏ లయలో రోదసిలోని సౌరకుటుంబము, మన భూమి పరిభ్రమిస్తున్నాయో, ఏ లయబద్దతతో భూమిపై రుతువులు ఏర్పడుతున్నాయో,  సముద్రాలలో అలలు,  వీచే గాలులు,  గాలిలోని ప్రాణవాయువు, జీవాణువులు లయబద్దంగా ఊపిరి తీసికొనటము, లయబద్దంగ నాడులు కొట్టుకోవటం, యావత్ సృష్టిలోని లయబద్దతకు కారణభూతమైన శక్తి,  దాని మూలాలు, దాని రూపము, దాని స్థితిగతులను  శోధించటం అసాధ్యం!  దానిని వర్ణించటము ఎవరి తరమూ కాదు. కాని   ఆ శక్తి  తరంగాలతో శృతికలిపే ప్రయత్నం చేయటం సాధకునికి సవాలుగా మిగిలి ఉన్నది. కొందరు   సాధకులు కృతకృత్యులైనా,  సాధించినది చాల స్వల్పమే.  వారు ఆ తరంగాల అంచుల  వద్ద  కలిగిన తన్మయత్వలో సర్వస్వం మరచి, అ లయను వర్ణించుటకు ప్రయత్నించి,  తాము అనుభవించిన యోగాన్ని, అనంతమైన విశ్వరూప దర్శనాన్ని,  కేంద్రీకృత శక్తిని,  యోగమాయను, మిధ్యాప్రపంచాన్ని, లోతుగా, పరిపూర్ణంగా అనుభవించుటకు వలయు పరిశ్రమ అసంపూర్ణమైనందున, అంచులవద్దనే ఆగిపోయినా,   తాము  అనుభవవించిన ఆ  అనంతమైన విశ్వారూపాన్ని,     అభివర్ణించుటలో విఫలమైనారు.  తాము అనుభవించినది గుర్తుచేసికోవటానికి ఎంతో ప్రయత్నించి విఫలమైనారు.  
              ఏ విధంగా తరంగ వైవిధ్యంతో కోట్లాది ప్రసారాల మాధ్యమాలు,  వ్యవస్థలు కనిపెట్టబడి, మానవాళికి ఉపకరిస్తున్నాయో! ఏ లయబద్దత విద్యుత్ తరంగాలను అదుపుచేస్తూ మానవాళికి ఉపకరిస్తున్నదో.   ఆ లయ లోనికి పయనించాలంటే..  శక్తి తరంగాలు  ప్రవహించే దైర్ఘ్యం, (Frequency) లోనికి పయనించి అందులో ఐక్యంకావాలి! శక్తి తరంగాలలోనికి  ఐక్యమైన క్షణం నుండి,  దేహ సంభందమైన అవసరాలు అంతమౌతాయి. జీవాణువుల జీవవ్యాపారానికి ఆవసరమైన శక్తి  సముపార్జనకు వలయు ప్రాణవాయువు, తదితర పోషకాల అవసరం లేకుండా, తనలోని అణునిర్మితచాలనను ఈ  సృష్టిస్థితిలయతో అనుసంధానం చేసికొంటాయి.  ఏవిధంగా తల్లి లయబద్దమైన జోలపాటతో శిశువు ఆకలిమరచి తన్మాయుదౌతాడో, ఎ అగోచర శక్తి తరంగాలు శూన్యంలోనుండి ప్రవహించి ఈ భూగోళాల స్థితిగతులను  అడుపుచేస్తున్నదో, ఆ శక్తి తరంగాల లయతో మమేకంకావడం  సాధకునికి  సాధనా వస్తువు!                
           నిశ్శబ్దంగా, నిర్మలంగా, శూన్యంగా, మేధస్సును కేంద్రీకరించి, చెవులు రిక్కించి వింటూ, లయతో మనం శృతికలిపి ప్రయత్నించాలి. నిర్మల నిరాకార నిర్గుణ నిశ్చల నైమిశారణ్యం  లోనికి  తధాత్మం చెందాలి.   మనపాత్రను శుభ్రంగ ఉంచుకొని, పరిపూర్ణమైన విశ్వాసంతో, నిష్కామ , నిష్కల్మష, నిర్వికార శూన్యతతో, ఖాళీగాఉంచుకొని, విధేయతతో వంగి,   చాకచక్యంగా పాత్రలోనికి ప్రవాహాన్ని పట్టుకోవాలి.  శక్తిప్రవాహం దిగువకే పారుతుంది (శూన్యతలోనికి)  అన్న సత్యాన్ని మరువరాదు.  మోకరిల్లి, చేతులుజోడించి అర్దించాలి! శిశువు రోదన తరంగాలలోని ఆకలి, నిద్ర, అసౌకర్యాదులను తల్లి ఎలా గ్రహిస్తుందో,  శిశువు ఆకలి తరంగాలు తల్లి క్షీరగ్రంధులను ఉత్తేజితంచేసే ప్రక్రియకూడా  ఒకరకమైన లయబద్దతకు నిదర్శనము !      అవిధేయత,  అహంకారము, అజ్ఞానము, అలసత్వము, అప్రయత్నముతో యిది అసాధ్యము.  నేను తలవంచను అంటే ?   ప్రవాహం ఎన్నటికీ నీవద్దకు రాదు...!    నీవే ప్రవాహం వద్దకు వెళ్ళాలి.!  
            లయబద్ద్తకు దూరంగా, కృత్రిమ జీవితం జీవిస్తే?   అపసవ్యదిశలో గాలిపటం? అపశ్రుతులతాళంతో చేసిన  నాట్యం వంటిది.   మన దేహం రూపుదాల్చిన మన తల్లిగర్భంతో మన యావజ్జేవితకాలం అవినాభావ సంభందం కలిగి ఉంటుంది.   మాతృప్రేమ, మాతృహృదయం ఎ లయకారణంగా జనిస్తున్నాయో,  ఖచ్చితంగా అదే లయ మనలను నియంత్రిస్తున్నది.    యింకాఉంది.....   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి